CPI Narayana: మావోయిస్టులు తుపాకీ వదిలి శాంతి చర్చలకు వస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు.. ప్రధాని మోడీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అన్నారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను చంపడాన్ని వ్యతిరేకిస్తున్నాం.. బస్తర్ అడవులను ఖాళీ చేయించి విలువైన ఖనిజాలు పెత్తందార్లకు ఇవ్వాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు ప్రభుత్వానికి తేడా ఏముంది అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నక్సలైట్లతో చర్చలు జరపాలి అని డిమాండ్ చేశారు. లేదంటే, బంగ్లాదేశ్ లో ఎంపికైన ప్రభుత్వాన్ని ప్రజలే కూలగొట్టారు.. శ్రీలంక, నేపాల్ లో కూడా ఇలాగే జరిగింది.. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వమే నేపాల్ తిరుగుబాటుకు ప్రధాన కారణం అని సీపీఐ నారాయణ వెల్లడించారు.
ఇక, 75 ఏళ్లు దాటిన వాళ్లు పార్టీలో ఉండొచ్చు.. నాయకత్వంలో ఉండకూడదు అని నారాయణ చెప్పుకొచ్చారు. సీపీఐలో కూడా దీనిపై ఛండీఘడ్ లో జరిగే సదస్సులో చర్చిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలో కూడా 75 ఏళ్లు దాటితే నాయకత్వం వదులుకోవాలనే దానిపై చర్చ జరుగుతుంది.. బహుశా రెండు మూడు నెలల్లో అది జరుగుతుందేమో అన్నారు. 2029 ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్యమం చేపడుతుంది. అలాగే, మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మిస్తే ప్రజలకు ఉపయోగం ఉండదు.. డబ్బులు లేవంటూనే అమరావతి నిర్మాణం చేస్తున్నారు కదా.. అలాగే, మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించాలి అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.