Site icon NTV Telugu

ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయడం తగదు : సీపీఐ నారాయణ

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచాలేకానీ… బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. తిరుపతిలోని స్థానిక బైరాగి పట్టెడలో ఉన్న సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం దాల్చుతున్న నేపథ్యంలో ఖమ్మం నందు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్‌ ఉద్యమ విరమణకు ప్రయత్నించగా తెలంగాణ ప్రజలు, ఊస్మానియా వర్శిటీ విద్యార్థులు తిరగబడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ఉద్యమాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. అదే పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుందని చెప్పారు. ఎన్జీవో నాయకత్వంలో ఉద్యోగుల తిరుగుబాటు తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని తెలిపారు.

ఉద్యోగ సంఘాలను నయానో… భయానో…. ఒప్పించిన జగన్ ప్రభుత్వం వారిని సంతృప్తిపరచలేకపోయిందని విమర్శించారు. ఉద్యోగులు తమకు వచ్చే బెనిఫిట్స్ ను ఎప్పటికీ వదులుకోరని చెప్పారు. గతంలో కంటే మెరుగైన ఫిట్మెంట్, ఇతర బెనిఫిట్స్ ను ఆశిస్తారని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంతో అనుకూల ధోరణితో కానీ… పదవి విరమణ వయసు పెంచడం వల్ల కానీ ప్రభుత్వ నిర్ణయాలను అంగీకరించి ఉండవచ్చన్నారు. కానీ బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడితే తిరగబడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఒకవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ…. మరోవైపు బెనిఫిట్స్ ను తగ్గిస్తామంటే ఉద్యోగులు తిరగబడక ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా బెనిఫిట్స్‌ను కల్పించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version