తెల్లబంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది. పత్తి ని తెల్ల బంగారం అన్నది మాటల్లోనే కాదు…వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారం లా మెరిసిపోతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రోజురోజుకీ పత్తి ధర పెరుగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా పత్తి ధర హవా కొనసాగుతూనే ఉంది.
కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. పత్తి, వేరుశనగ పంట పెద్ద ఎత్తున ఆదోని మార్కెట్ కు తరలి వస్తుంది. ఈ మార్కెట్ లో ఏటా 20 లక్షల క్వింటాళ్ల పత్తి, 10 లక్షల క్వింటాళ్ల వరకు వేరుశనగ లావాదేవీలు జరుగుతాయి. పత్తి ఎపితోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆదోని మార్కెట్ కు తీసుకువస్తారు. ఈ మార్కెట్ లో వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి జిన్నింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. దూదిని తమిళనాడు, పత్తి గింజలు మధ్యప్రదేశ్ , గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు రవాణా చేస్తారు.
ప్రస్తుతం పత్తి ధర భగ్గుమంటోంది. క్వింటాలు 13 వేలకు పైమాటే ఉంది. 2020-21 లో 12 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ రాగా 2021-22 లో 6 లక్షల క్వింటాలు మాత్రమే వచ్చింది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ లో దూది, పత్తి గింజాలకు డిమాండ్ పెరగడం, విస్తీర్ణం తగ్గడంతో ధర విపరీతంగా పెరిగింది. 2021 డిసెంబర్ నుంచి క్రమంగా పత్తి ధర పెరుగుతూ వచ్చింది. 2022 జనవరి లో క్వింటాలు పత్తి 10 వేల మార్కు దాటింది. అదే ఎక్కువ ధర అనుకుంటే 2022 మార్చి నాటికి క్వింటాలు పత్తి రూ.12,500 కు చేరింది. ఈ ఏడాది మే నాటికి క్వింటాలు పత్తి 13,400 మార్కు దాటింది. సుమారు 6 నెలలుగా పత్తి ధర పైపైకి ఎగబాకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆదోని మార్కెట్ యార్డు చరిత్రలో ఇది అత్యధిక ధరగా చెబుతారు. అంతర్జాతీయ మార్కెట్ లో దూది, పత్తి గింజలకు డిమాండ్ పెరగడం, భారీ వర్షాలతో పత్తి పంట దెబ్బతిని దిగుబడి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 6 క్వింటాలకు మించలేదు. దీంతో ధర కూడా పెరిగింది. దిగుబడి తగ్గినా ధర దాదాపు రెట్టింపు కావడంతో రైతులకు దిగుబడిలో నష్టం కనిపించడం లేదు. ధర పెరగడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు పత్తి రైతులు.
Hyderabad MMTS: తగ్గిన ప్రయాణికులు.. రద్దైన రైళ్ళు