Controversy On Minister Meruga Nagarjuna Comments In AP Assembly: దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ నాగార్జున అసెంబ్లీలో బాల వీరాంజనేయ స్వామిపై వ్యాఖ్యలు చేశారంటూ సభలో దుమారం రేగింది. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని మంత్రి చెప్తుంటే, టీడీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. నా పుట్టుక గురించి అసెంబ్లీలో మాట్లాడటం ఏంటని వీరాంజనేయ స్వామి సభలో ప్రశ్నించారు. రికార్డులు చెక్ చేయమన్న ఆయన.. ఆ రికార్డుల్లో వాళ్లు ఆ మాట అనలేదంటే తాను రాజీనామా చేస్తానని బాల వీరాంజనేయ స్వామి తేల్చి చెప్పారు. ఒకవేళ ఆయన తన పుట్టుక గురించి మాట్లాడినట్టు రికార్డ్‌లో ఉంటే, వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి మేరుగపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు.
అంతకుముందే మంత్రి నాగార్జున కామెంట్లపై టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి చేసిన కామెంట్లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఉండి కూడా ఈ తరహా వ్యాఖ్యల్ని కంట్రోల్ చేయకుంటే ఎలా అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. స్పీకర్ ఛాంబర్‌లో వాళ్లు ఉండగానే.. గడికోట శ్రీకాంత్ రెడ్డి లోపలికి వచ్చి మేరుగ నాగార్జున ఆ తరహా కామెంట్లు చేయలేదన్నారు. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రికార్డులు పరిశీలించుకోండంటూ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. గతంలోనూ చంద్రబాబు, లోకేష్ గురించి ఇదే తరహా కామెంట్లు చేశారని, కానీ రికార్డుల్లేవన్నారని టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తాను చేసిన వ్యాఖ్యలను మేరుగ నాగార్జున తీసుకునేలా సూచించాలని, ఆయన క్షమాపణ చెప్పకుండా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.
