Site icon NTV Telugu

Minister Botsa: సీఎం జగన్‌పై కుట్రలు జరుగుతున్నాయి

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్‌పై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు దుర్భాషలాడుతూ అసభ్య పదజాలాలను వాడుతున్నారని.. ఇది మంచిది కాదని మంత్రి బొత్స హితవు పలికారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ నేతలందరూ కలిసికట్టుగా ఉంటే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలో లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత వైసీపీ నేతలందరిపైనా ఉందన్నారు.

వైసీపీ నేతలు ఒంటెద్దు పోకడలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి బొత్స సూచించారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే సరిదిద్దుకుని పనిచేయాలని.. అభిప్రాయ భేదాలుంటే ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారని మంత్రి బొత్స తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని తెలుసుకుని సవరించి ప్రజలకు మరింత లబ్ధి జరిగేలా చూడాలన్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందన్నారు. పాలనా సౌలభ్యం కోసం పలు నియోజకవర్గాలను కలుపుకుని జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందని బొత్స వివరించారు. పార్టీలకు అతీతంగా ప్రతి గడపకు వెళ్లి పథకాలపై అభిప్రాయం తెలుసుకోవాలన్నారు.

మహిళలను పూర్తిగా విస్మరించి పెత్తనం సాగిద్ధామని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. అన్ని కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాల్సిందేనన్నారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు. అర్హులందరికీ అందాలన్న విధానంతోనే ఇప్పుడు ప్రజలకు అన్ని పథకాలు వస్తున్నాయన్నారు. పేదవాళ్లకి దోచుపెడుతున్నారని చంద్రబాబు అంటున్నారని… ఇది అందరి సంపద అని.. అందుకే ఇది ప్రజలందరికీ అందాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని తెలిపారు. మనది అన్న భావనతోనే ఉండాలి తప్ప.. నాది అన్న భావన ఉండకూడదని.. అందరూ కలిసి పనిచేయాలన్నారు.

Varla Ramaiah : పురుషులను చూస్తేనే ఆమె భయంతో వణికిపోతోంది

Exit mobile version