NTV Telugu Site icon

Gidugu Rudraraju: పొత్తుల ప్రసక్తేలేదు.. 175 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ..

Gidugu Rudraraju

Gidugu Rudraraju

Gidugu Rudraraju: 2024 ఎన్నికల వాతావరణం అప్పుడే స్టార్ట్‌ అయ్యింది.. ఓ వైపు పొత్తులు.. మరోవైపు పోటీలపై ఎవరి ఎత్తుగడలో వారు ఉన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ సారి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.. ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహారం ఎటూ తేలలేదు.. ఎవరితో ఎవరికి పొత్తు అనేది తేలడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గట్టి ఎదురుదెబ్బలు తిన్న కాంగ్రెస్‌ పార్టీ.. మళ్లీ తన ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. అయితే, రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. నంద్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు.. 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.. 2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు రుద్రరాజు.

Read Also: DRI notice to Samsung: పన్ను ఎగవేత ఆరోపణల కేసులో

మరోవైపు ఏపీలో బీఆర్ఎస్‌ ఎఫెక్ట్‌ ఉండబోదన్నారు గిడుగు రుద్రరాజు.. బీఆర్ఎస్‌ వచ్చినా.. ఏపీలో చేసేది ఏమీ ఉండబోదన్నారు.. ఇక, తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పెద్దపెద్ద కోరికలు, లక్ష్యాల వల్ల బీఆర్‌ఎస్‌కే నష్టమని జోస్యం చెప్పారు.. బీఆర్ఎస్ త్వరలో వీఆర్ఎస్ అవుతుందని ఎద్దేవా చేశారు.. ఖమ్మంలో బీఆర్ఎస్‌ బహిరంగ సభ ఎఫెక్ట్ ఏమీ లేదని కొట్టిపారేవరు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. కాగా, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని నిన్న వ్యాఖ్యానించారు గిడుగు రుద్రరాజు.. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని మీడియా ప్రతినిధులకు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.. ఇక, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని.. ఆ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేస్తున్నామని వెల్లడించిన విషయం విదితమే.