ఏపీలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ తులసిరెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాడు బిగించడమే అని అభిప్రాయపడ్డారు. ఇది ఖచ్చితంగా ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అంటూ మండిపడ్డారు. రైతుల శ్రేయస్సు కోసం ఆనాడు వైఎస్ఆర్ ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నీరు గారుస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే సీఎం జగన్ తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాల వలన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తులసిరెడ్డి విమర్శించారు. రైతులను ఏడిపిస్తే వైసీపీ ప్రభుత్వం మాడి మసైపోక తప్పదని హెచ్చరించారు. రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బట్టి పొత్తులపై ఆలోచిస్తామని తులసిరెడ్డి అన్నారు. పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రానికి నెంబర్ ఒన్ ద్రోహి బీజేపీ అయితే. .నంబర్ టు ద్రోహి వైసీపీ అని ఆరోపించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం చిత్తశుద్ధి లేని చర్యగా తులసిరెడ్డి అభివర్ణించారు. ఆత్మకూరు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.