గతంతో పోల్చి చూస్తే… మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్‌లు రద్దు వంటి ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని.. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందని వ్యాఖ్యానించారు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.. అయితే, అక్రమంగా జరుగుతున్న మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎంకు తెలిపారు అధికారులు. వాటిని నివారించడానికి తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని వివరించారు.. ఇక, ఎస్‌ఈబీలో పరివర్తన కార్యక్రమం జరుగుతున్న తీరుపై వివరాలు తెలుసుకున్నారు సీఎం.. పరివర్తన కార్యక్రమంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు..
Read Also: Karanam Venkatesh: టీడీపీది ముగిసిన చరిత్ర.. మళ్లీ వైసీపీదే అధికారం..!
చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలు ద్వారా వారికి ఊతమివ్వాలని అధికారులకు సూచించారు సీఎం వైఎస్ జగన్.. ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించాలన్న ఆయన.. అప్పుడే అక్రమ మద్యం తయారీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారన్నారు.. ఇక, గంజాయి, అక్రమ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.. ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేస్తూనే… అక్కడ కూడా ఉపాధి మార్గాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకుని.. లేకపోతే అర్హులైన వారికి పట్టాలివ్వాలని ఆదేశాలు జారీ చేశారు.. వారికి విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.