CM Jagan Mohan Reddy: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ం అధ్యక్షతన రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సీఎం జగన్ స్వయంగా సమీక్షించారు. అయితే గడప గడపకు కార్యక్రమం విషయంలో పలువురు ఎమ్మెల్యేలు వెనుకబడటంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 27 మంది ఎమ్మెల్యేలకు ఆయన క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. 27 మంది పేర్లతో సహా జగన్ ప్రస్తావించారు. వాళ్లంతా వేగం పెంచాలని.. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. నెలకు 16 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గతంలోనే చెప్పినా ఆ పని చేయడం లేదని సీఎం జగన్ మండిపడ్డారు. తక్షణమే ఈ పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
Read Also:Fire accident: రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది మృతి
అయితే ఈ కార్యక్రమంలో స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొనాలని.. వాళ్ల కుటుంబ సభ్యులు పాల్గొంటే పరిగణించలేమని సీఎం జగన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ జాబితాలో నలుగురు మంత్రులు ఉన్నారని.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, రోజా సెల్వమణి ఉన్నారని సమాచారం అందుతోంది. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆళ్ల నాని, కొడాలి నాని పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం జగన్ క్లాస్ పీకిన ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గ్రంధి శ్రీనివాస్, శిల్పాచక్రపాణి రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కోడుమూరు శ్రీనివాసులు, ధనలక్ష్మీ ఉన్నారు. 70 రోజుల్లో 15 రోజులు కంటే తక్కువ కాలం తిరగడం సమంజసం కాదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోమని చెప్పినా.. కొంతమంది నేతలు కాలక్షేపం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. 27 మందికి ఇదే లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లే టార్గెట్‌గా సీఎం జగన్ ఈ రివ్యూ మీటింగ్ చేపట్టారు.
