Site icon NTV Telugu

CM Jagan: మంచి చేస్తున్న ప్రభుత్వానికి.. ప్రజల ఆశీర్వాదమే శ్రీరామరక్ష

Cm Jagan

Cm Jagan

మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి భరత్‌పై వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 83వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు విజయంపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా ఆత్మకూరులో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు. విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు… పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజలందరి ఆశీస్సులే శ్రీరామరక్ష అని జగన్ పేర్కొన్నారు.

మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్‌రెడ్డి విజయంపై మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా స్పందించారు. ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు అని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణమన్నారు. రాష్ట్రంలోఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. ఆంధ్ర​ప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదని తెలిపారు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని.. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయిందని ఆరోపించారు. ఈ గెలుపుతో తాము చంకలు గుద్దుకోకుండా వచ్చే ఎన్నికలకు పనిచేస్తామన్నారు. 2024 ఎన్నికలు చాలా క్లిష్టతరమైన ఎన్నికలు అని.. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం జగన్ వచ్చే ఎన్నికలపై జాగ్రత్తగా ఉండాలని మేకపాటి రాజమోహన్‌రెడ్డి సూచించారు. చంద్రబాబును ఎదుర్కోవాలంటే సులువుగా కాదని.. చంద్రబాబు అన్ని ఆయుధాలను సమకూర్చి బరిలోకి దిగుతాడని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.

Exit mobile version