NTV Telugu Site icon

CM Jagan: రీజనల్ కో ఆర్డినేటర్లు మరింత బాధ్యతగా పనిచేయాలి

Gadapaku Gadapaku

Gadapaku Gadapaku

అమరావతి సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. మొదటిసారి వర్క్‌షాపుతో పోలిస్తే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పురోగతి బాగుందన్నారు. కానీ అందరికీ ఒక విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నానని.. పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్‌ ఉండవని.. షాట్‌కర్ట్స్‌కు మనం తావిస్తే ఆ పరీక్షల్లో ఫెయిల్‌ అవుతామన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అని… ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలోని గడప గడపకూ తలెత్తుకుని వెళ్లే పరిస్థితి మనకు ఉందని.. ఎందుకంటే.. మనం ఆ మేరకు చక్కటి పరిపాలన ప్రజలకు అందించామని జగన్ తెలిపారు. ప్రతి ఇంటికీ ఏం మేలు జరిగింది? ఎంత మేలు జరిగింది? ఏ స్కీములందాయి? అన్న జాబితాలు తీసుకుని వెళ్తున్నామని.. ప్రతి ఇంట్లోనూ.. మీరు చెప్పిన దాంతో వారే ఏకీభవించి మన ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు.

ఒక గ్రామంలోని సచివాలయానికి వెళ్లినప్పుడు 100 శాతం ఇళ్లు పూర్తి చేయడం తప్పనిసరి అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అలా చేయకపోతే దాని వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఒకసారి మనం గ్రామ సచివాలయానికి వెళ్తే ఎన్ని రోజూలైనా సరే మొత్తం అన్ని ఇళ్లకూ వెళ్లాలని… గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న విధంగా సంపూర్ణంగా పూర్తిచేయాలని తెలిపారు. మనం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల నిధులు ఇస్తున్నామని.. గ్రామానికి బాగా ఉపయోగపడే వాటిపై ఖర్చు చేయాలని ఆదేశించామన్నారు. గ్రామ సచివాలయాల్లో ఎమ్మెల్యే తిరిగినప్పుడు కేటాయించిన నిధుల ప్రకారం నిధులు మంజూరు చేయాలన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు గ్రామంలోకి వెళ్లినప్పుడు సమస్య మీ దృష్టికి రాగానే అప్పటికప్పుడే ఆ పని మంజూరు చేయాలన్నారు. ఆ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం 175 సీట్లకు 175 సీట్లలో గెలవాలని… ఒక్క సీటు కూడా మిస్‌ కాకూడదన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే గడప గడపకు రూపంలో చక్కటి ప్రణాళిక ఇచ్చానని సీఎం జగన్ తెలిపారు. 175కు 175 సీట్లు సాధించడం అన్నది అసాధ్యం కానే కాదని.. ముమ్మాటికీ ఇది సాధ్యమన్నారు. ప్రభుత్వపరంగా మంచి పనులు చేశామని.. రాష్ట్రంలో 85 శాతం ఇళ్లకు మంచి జరిగిందన్నారు. ప్రతి ఇంటికీ మంచి చేశామని లెటర్‌ కూడా తీసుకుని వెళ్తున్నామన్నారు. గ్రామంలో సచివాలయానికి వెళ్లేటప్పుడు ప్రాధాన్యతా పనులుగా మీరు గుర్తించిన రెండు నెలల్లో పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు నెలలో కనీసం 16 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ఎన్నికలకు 19 నెలలు మాత్రమే ఉందని.. అంటే మనకు తగిన సమయం ఉందని.. మనం చేయాల్సిందల్లా ప్రతి ఇంటికీ పోవడం.. తిరిగితేనే మన గ్రాఫ్‌ పెరుగుతుందన్నారు. కొందరు తమ గ్రేడ్‌ పెంచుకోవాల్సి ఉందని.. ప్రతి ఒక్కరితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎవ్వరినీ పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని.. వాళ్ల గేర్‌ మార్చడమే తన లక్ష్యమని జగన్ అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు సర్వే చేయిస్తానని.. ప్రజాదరణ ఉంటేనే మళ్లీ టికెట్లు ఇస్తానని తెలిపారు. తిరిగి డిసెంబరులో మొదటి రెండు వారాల్లో సమావేశం అవుదామన్నారు. అప్పటికి మనకు 70 రోజుల టైమ్‌ వస్తుందని.. కాబట్టి నెలకు 16 రోజులు ప్రతి సచివాలయంలో ప్రతి ఇల్లు తిరగాలన్నారు. ప్రతి సచివాలయంలో కనీసం మూడు రోజులైనా ఉండాలని పేర్కొన్నారు. రాజకీయం అనే జీవితాన్ని మనం ఎంచుకున్నాం అని.. దాని కోసం ఇది చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికై మళ్లీ గెలుచుకుని రావడం అన్నది.. ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న మీరు తిరిగి ఓడిపోతే గౌరవం తగ్గుతుందన్నారు. దేవుడి దయవల్ల మనకు అలాంటి పరిస్థితి లేదన్నారు. మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారని.. వారికి మనం జవాబుదారీతనంగా ఉన్నామని తెలిపారు. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యం మిస్‌కాకూడదని… దానికోసం అందరూ కష్టపడదామన్నారు. రీజినల్‌ కోఆర్డినేటర్లుగా ఉన్నవారు మరింత బాధ్యతగా ఉండాలని.. గడప గడపకూ విషయంలో ఎవరైనా వెనకబడినట్టు ఉంటే వారిని ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేయాలని… వారికి గైడ్‌ చేయాలని సూచించారు. ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పాలని.. ప్రత్యామ్నాయం చూస్తామని జగన్ అన్నారు.

అటు గడప గడపకు మన ప్రభుత్వంపై క్యాంప్‌ కార్యాలయంలో వర్క్‌షాప్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో జరిగే పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని కోరారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్‌ రెడ్డి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా వెన్నపూస రవి పోటీ పడుతున్నారని సజ్జల తెలిపారు.