Site icon NTV Telugu

CM JAGAN Review: సహకారబ్యాంకుల్ని కాపాడుకోవాలి

ఏపీలో సహకార శాఖపై సీఎం జగన్‌ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జిల్లా, కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పని తీరును సమీక్షించారు. కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది.

సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం కాపాడుకోవాలి. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. వెసులుబాటు ఉన్నంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి. బ్యాంకింగ్‌ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలి. నాణ్యమైన రుణ సదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధి చెందుతాయి. డీసీసీబీలు పటిష్టంగా ఉంటే.. రైతులకు మేలు జరుగుతుందన్నారు జగన్.

బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపారపరంగా లాభం పొందుతున్నాయి. రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోంది. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమవైపుకు తిప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ఆర్బీకేల్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం అన్నారు సీఎం జగన్.

https://ntvtelugu.com/350-members-telugu-students-struked-in-ukraine/

జిల్లా, కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రుణాల మంజూరులో రాజకీయాలకు చోటు ఉండకూడదు. అవినీతికి, సిఫార్సులకు తావులేకుండా కేంద్ర సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగాలన్నారు. ఆమేరకు పీఏసీఎస్‌లను మ్యాపింగ్‌ చేసి వాటి కింద వచ్చే ఆర్బీకేలను నిర్ణయించాలన్నారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కార్యకలాపాలను పీఏసీఎస్‌లతో అనుసంధానం చేయాల్సిన అవసరం వుందన్నారు. ఆర్బీకేల్లోని బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు రైతులకు, బ్యాంకులకు మధ్య ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. అధికారులు బ్యాంకింగ్‌ నిపుణులతో మాట్లాడి ఒక విధానాన్ని రూపొందించాలని జగన్ సూచించారు.

Exit mobile version