ఏపీలో జిల్లా పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది తరువాత కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలన్నారు.
దీనితోపాటు కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని, కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అంతేకాకుండా వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ భవనాలకోసం మంచి డిజైన్లను ఎంపికచేసుకోవాలని, పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలన్నారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
