Plastic Ban: విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖలో శుక్రవారం నిర్వహించిన ‘సాగర తీర స్వచ్ఛత’ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర తీరంలో 20వేల మందితో 28కి.మీ. మేర బీచ్ క్లీనింగ్ చేపట్టి 76 టన్నుల ప్లాస్టిక్‌ను తొలగించామని తెలిపారు. అటు ఏపీలో ఈరోజు నుంచే ప్లాస్టిక్ బ్యానర్లు రద్దు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఇకపై క్లాత్ బ్యానర్లు మాత్రమే కనిపించాలని సూచించారు. విశాఖ నుంచే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం అమలు చేస్తామన్నారు. ఇప్పటికే టీటీడీ విజయవంతంగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తోందని గుర్తుచేశారు. ఆహ్వానాలు, సభలకు కాస్త ఖర్చు ఎక్కువైనా బట్టతో తయారు చేసే ఫ్లెక్సీలనే పెట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు. 2027నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ మన సంకల్పం అని తెలిపారు. అటు విశాఖలో సీఎం జగన్ సమక్షంలో పార్లే ఫర్ ఓషన్, మున్సిపల్ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. 2022నుంచి అరేళ్లపాటు ఈ అగ్రిమెంట్ ఉంటుంది. సముద్రాలు, నదుల్లో సేకరించిన రీయూజ్డ్ ప్లాస్టిక్స్ వినియోగంపై ఒప్పందం పనిచేస్తుంది.
తాను విశాఖ నగరానికి వస్తున్నప్పుడు తన ఫ్లెక్సీలు కనిపించాయని.. ప్లాస్టిక్‌ను తొలగించే కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ ఫ్లెక్సీలు ఏంటని కలెక్టర్‌ను అడిగానని సీఎం జగన్ అన్నారు. విశాఖలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమంగా తెలిపారు. ఈ స్ఫూర్తి చాలా అద్బుతమని.. వైజాగ్ ప్రత్యేకమైన నగరం అని.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలు.. రెండూ ఒక నాణేనికి రెండు కోణాలు అని పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించలేకపోతే మనకు మనుగడ ఉండదన్నారు. సముద్ర తీరాలు పరిశుభ్రంగా ఉండాలని.. గాలిలో 70 శాతం ఆక్సిజన్ సముద్రంలో ఉన్న చెట్లు నుండి వస్తుందన్నారు. మన సముద్ర తీరాల్లో ఎక్కడ చూసినా ఫ్లాస్టిక్ కనపడుతుందని.. సముద్ర గర్భంలో కూడా ఫ్లాస్టిక్ ఉంటుందని.. శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.
Read Also: Gudivada Amarnath : ఆ మంత్రి సిట్టింగ్ సీట్ వదులుకొని సేఫ్ జోన్ వెతుకున్నారా..?
వాతావరణంలో మార్పులకు కొన్ని సంస్థలు పని చేస్తున్నాయని.. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వివిధ రకాల వస్తువులను పార్లే సంస్థ తయారు చేస్తుందని సీఎం జగన్ చెప్పారు. రాబోయే రాజుల్లో ప్లాస్టిక్ లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని.. విశాఖలో పార్లే ప్యూచర్ సంస్థ రాబోతుందన్నారు. జి.ఐ.ఎస్.పి, పార్లే ఫర్ ఓషన్ వర్క్స్‌తో భాగస్వామ్యులం అయ్యామన్నారు. రీయూజ్డ్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేసిన అడిడాస్ షూస్, సన్ గ్లాసెస్‌ను సీఎం జగన్ చూపించారు.మెగా బీచ్ క్లీనప్ డ్రైవ్‌లో భాగంగా 72టన్నుల చెత్త సేకరణ చేపట్టినట్లు వివరించారు. పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి ముందుకు వచ్చిన యాజమాన్యానికి అభినందనలు అని.. రీసైక్లింగ్ సూపర్ హబ్ మన దగ్గర జరుగుతుందని.. దీని ద్వారా 20వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు రానున్నాయని సీఎం జగన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో క్లాప్ ద్వారా చెత్త సేకరణ 62శాతానికి పెరిగిందన్నారు. దానిని 100శాతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ దిశగా గ్రామ, వార్డు సచివాలాయలు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయన్నారు.
అటు సముద్ర తీరంలోని వ్యర్థాలను నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. ‘సాగర తీర స్వచ్ఛత’ కార్యక్రమంలో భాగంగా విశాఖ తీరంలోని పరిసరాలను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. దీనిలో భాగంగా పార్లే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.
