ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా 1,057 ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి సగటున నాలుగు లక్షల ప్రసవాలు జరుగుతుంటాయి. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా నెలలు నిండిన గర్భిణీలను కాన్పు కోసం ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి.. ప్రసవం అనంతరం మళ్లీ సురక్షితంగా ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుస్తారు. తల్లులకు సాయం అందంచేందుకు వీలుగా కేంద్రీకృత 102 కాల్ సెంటర్ సేవలను కూడా ప్రభుత్వం మెరుగుపరిచింది.
