ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జగన్ చేసిన న్యాయంపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలను గుర్తించి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శాసనమండలి సభ్యుల ఎంపిక నిర్ణయమేనని అందుకు నిదర్శనం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు.
Read Also: Renault, Nissan Vehicles: ఉమ్మడిగా వాహనాలను ఉత్పత్తి చేయనున్న రెనాల్ట్, నిస్సాన్
జగనన్న పాలనలో సామాజికన్యాయం జరుగుతుందని నిరూపితమయిందన్నారు. చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం నాడు నినాదమైతే.. నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానంగా అమల్లోకి రావడం ఒక బీసీ మంత్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇది గొప్పనిర్ణయం. ఈరోజు నూతనంగా ఎంపికజేసిన 18 మంది శాసనమండలి సభ్యుల్లో సామాజికన్యాయం పాటించి బీసీలకు పెద్దపీట వేయడం చరిత్రలో గుర్తుండాల్సిన రోజుగా చెబుతున్నాము. ఇన్నాళ్లూ తమకు సామాజిక గుర్తింపు లేదని .. తమకూ అవకాశాలిస్తే చట్టసభల్లో కూర్చొని ఆత్మగౌరవాన్ని చాటుకుంటామని ఉవ్విళ్లూరిన మా వర్గాల్ని ముఖ్యమంత్రి జగనన్న అక్కున చేర్చుకున్నారు. శాసనమండలి సభ్యుల నియామకంలో అరుదైన గొప్ప నిర్ణయం తీసుకుని అణగారిన వర్గాల కోరికలను నెరవేర్చారు. ఈ విషయం పట్ల సమాజంలో పెద్దలు, సామాజికవేత్తలు ఆలోచించాలని కోరుతున్నాను.
2014–2019లో చంద్రబాబు 48 మంది ఎమ్మెల్సీలుగా పదవులిస్తే.. అందులో 30 మంది ఓసీలకు (62.5 శాతం) ఇచ్చారు. కేవలం18 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు (అంటే 37 శాతం) ఇచ్చారు. కానీ, ఈరోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 68.18 శాతం పదవులిచ్చారు. అగ్రవర్ణాలకు కేవలం 31 శాతం మాత్రమే కేటాయించారు. దీన్నిబట్టి మేం గర్వంగా చెప్పుకుంటున్న విషయమేంటంటే, చరిత్రలో ముందెన్నడూ లేని సామాజికన్యాయ చరిత్రకారుడుగా జగన్‌మోహన్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. లోక్‌సభలో ఆరుగురు బీసీ ఎంపీలు ఉన్నారు. ఆత్మగౌరవ కులాల ఆశాజ్యోతిగా పుట్టిన దేవుని అవతారంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు మంత్రి వేణుగోపాల కృష్ణ.
Read Also: JNU: జెఎన్‌యూలో ఉద్రిక్తత.. పెరియార్, కార్ల్ మార్క్స్ ఫోటోలు ధ్వంసం..