AP Collectors Conference: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పౌరసేవల అమలు లాంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి సీసీఎల్ఏ, సీఎస్, రెవెన్యూ, ఆర్థిక శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. అయితే, మొదటి రోజు ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రసంగంతో మీటింగ్ స్టార్ట్ కానుంది. అనంతరం సీఎస్, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో ప్రెజెంటేషన్లు క్లిష్టంగా కాకుండా సూటిగా ఉండాలి.. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను విభిన్నంగా నిర్వహిస్తున్నాం.. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మొదటి రోజు చర్చించే అంశాలు:
* జీఎస్డీపీపై ప్రజెంటేషన్
* సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం పురోగతిపై సమీక్ష
* సంక్షేమం, సూపర్ సిక్స్, అన్నా క్యాంటీన్లు, పీ4 అంశాలపై చర్చ
* లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్ష
* స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్, మున్సిపల్ రంగాలపై సమీక్ష
రెండో రోజు చర్చించే అంశాలు:
* మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్
* ఐటీ, క్వాంటం వ్యాలీ, ఆర్టీఐహెచ్, డేటా లేక్, ఏఐ, వాట్సప్ ద్వారా పౌరసేవలు
* రెవెన్యూ విభాగంలో భూములు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్ అంశాలు
* రాష్ట్ర శాంతిభద్రతలపై ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్ష
* పౌర సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిపైనా చర్చించనున్నారు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ విజన్ ను పటిష్టంగా అమలు చేసేలా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.