CM Chandrababu: ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా “భారత్ కేంద్రంగా అభివృద్ధి- ఏపీ సానుకూలతలు” అనే అంశంపై ఆయన ప్రసంగించారు. దశాబ్దాలుగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతున్నాను.. దావోస్‌కు వచ్చిన ప్రతిసారీ ప్రపంచ పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటా, కొత్త ఆలోచనలు పంచుకుంటానని చెప్పారు. టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పులను తెలుసుకుని పాలసీలను రూపొందిస్తానని స్పష్టం చేశారు. దావోస్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలను అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్‌గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
అయితే, నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చగల శక్తి ఉందని, దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారని పేర్కొన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటేనే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయి.. ప్రపంచంలో మరే దేశంలో లేని యువ శక్తి భారత్‌లో ఉంది, దేశానికి ప్రస్తుతం తిరుగులేని సమర్థ నాయకత్వం ఉందన్నారు. ప్రస్తుతం ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానాలని స్పష్టం చేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, ఆ గ్రోత్ స్టోరీని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Read Also: Telangana : సినిమా టికెట్స్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఇక, గతంలో పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు తెలుగు ప్రజల విజయాలు, ఏపీ బ్రాండ్ సానుకూల అంశంగా మారాయని తెలిపారు. ప్రతి రంగంలోనూ నిర్దిష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలి.. ఏపీకి రావాలి అంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తితో కొత్త చరిత్రకు నాంది పలికామని, ఇకపై ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయబోతున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు వైద్య రంగంలోనూ డ్రోన్ల వినియోగం చేపట్టబోతున్నాం.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్ ప్రారంభించాలనే ఆలోచన ఉందని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: UP: యూపీలో వింతైన ఘటన.. ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే..!
అలాగే, దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి రావడం రాష్ట్ర బలాన్ని చాటుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఏపీకి ఉన్న ప్రధాన బలాలు అన్నారు. వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.. ఏపీకి వచ్చి అక్కడ అమలు చేస్తున్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితులను స్వయంగా చూసి నిర్ణయం తీసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలను పరీక్షించాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదు.. ఏపీ పారిశ్రామికవేత్తలకు అతిపెద్ద మార్కెట్‌గా మారుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
