గుండెపోటుతో మృతిచెందిన తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. అనంతరం శేషాద్రి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శేషాద్రి ఇక లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. శేషాద్రి స్వామితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. శేషాద్రి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఎన్వీ రమణ చెప్పారు.
Read Also: గుడ్‌న్యూస్.. విద్యాదీవెన డబ్బులు విడుదల
ఇకపై శేషాద్రి స్వామి లేకుండా తాను తిరుమలకు రావడం ఊహించలేదని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. దేవుని సేవలో తరిస్తూ ఆరోగ్యాన్ని కూడా శేషాద్రి విస్మరించారన్నారు. ఆయన కోరుకున్న విధంగానే శ్రీవారి సేవలో ఉండగానే చివరి శ్వాస విడిచారని ఎన్వీ రమణ అన్నారు. శేషాద్రి స్వామి రచించిన పుస్తకాలను టీటీడీ ముద్రించి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని ఎన్వీ రమణ సూచించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సీజేఐ ఎన్వీ రమణ చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతిలోని శేషాద్రి నివాసానికి వెళ్లారు. కాగా ఎన్వీ రమణతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి కూడా శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించారు.
