ఏపీ పర్యటనలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను జడ్జిలే నియమిస్తారని భావించడం ఓ భ్రమ అని సీజేఐ వ్యాఖ్యానించారు. మిగతా వ్యవస్థల తరహాలో న్యాయవ్యవస్థ కూడా ఓ పావు లాంటిదేనన్నారు. జడ్జిల నియామకాల్లో చాలా మంది పాత్ర ఉంటుందని.. జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని సీజేఐ తేల్చి చెప్పారు. జడ్జిల నియామకాల్లో ఇంత జరుగుతున్నా.. అది తెలిసిన వాళ్లు కూడా జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
మరోవైపు బెజవాడ చట్టానికి పట్టం కట్టిన నగరమని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. బెజవాడ గాలి పీల్చి.. కృష్ణా నీళ్లు తాగి.. బెజవాడ ఇచ్చిన ధైర్యంతో అనేక డక్కా మొక్కీలు తిని ఈ స్థాయికి చేరానన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్‌లో సభ్యునిగా ఉన్న రోజుల్లో ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా నాటి బెజవాడ బార్ అసోసియేషనే స్పందించేదని గుర్తుచేశారు. నాడు బెజవాడ బార్ అసోసియేషన్‌కు ఉన్న చైతన్య స్పూర్తి ఇప్పుడు కొద్దిగా తగ్గిందనే చెప్పాలన్నారు. బెజవాడలో కోర్టుల బిల్డింగ్ కోసం తాను యాక్టింగ్ చీఫ్ జస్టిస్సుగా ఉన్నప్పుడు నిధులు కేటాయింపచేశానని.. కానీ ఇప్పటికీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కానందుకు చాలా బాధపడుతున్నానని పేర్కొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బిల్డింగ్ పూర్తి కాలేదన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో స్వతంత్ర వ్యవస్థ ఉండాలని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. పీపీల వ్యవస్థ ప్రభుత్వం ఆధీనంలో ఉందని.. అధర్మంగా ఎవరికైనా శిక్షలు పడకుండా ఉండాలంటే పీపీల వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నాలుగు కోట్లకు పైగా కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. న్యాయమూర్తులను.. న్యాయ వ్యవస్థను బయట సమాజం నుంచి.. బయట ప్రపంచం నుంచి కాపాడాల్సింది న్యాయ వాదులే అన్నారు. న్యాయమూర్తులపై జరుగుతోన్న దాడుల గురించి.. వారికి జరుగుతోన్న అవమానాల గురించి న్యాయవాదులే నిలబడి ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. న్యాయవ్యవస్థకు రాజకీయాలతో సంబంధం లేదని.. ఇదొక వ్యవస్థ అని.. దీనిపై ప్రజలకు నమ్మకం పోకూడదని సీజేఐ అన్నారు. డబ్బు లేకపోవడం వల్ల న్యాయం లభించలేదనే పరిస్థితి రాకూడదని.. పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించాలని సీజేఐ పేర్కొన్నారు.
