NTV Telugu Site icon

డాలర్ శేషాద్రి హఠాన్మరణం… సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం..

శ్రీవారి ఆలయ వోఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. ఇవాళ వేకువజామున గుండెపోటు రావడంతో కన్నుమూశారు.. సుదీర్ఘ సమయం శ్రీవారి సేవలో తరించిన భాగ్యం ఆయనకే దక్కింది.. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్న ఆయన.. 2007లో రిటైర్‌ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో వోఎస్డీగా టీటీడీ కొనసాగించింది.. ఆయన జీవితంలో చివరి క్షణాల వరకు శ్రీవారి సేవలోనే ఉన్నారు.. ఇక, ఆయన మృతికి పలువురు వీఐపీలు సంతాపం తెలియాజేశారు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా శేషాద్రి సేవలను గుర్తుచేసుకున్నారు.. శ్రీవారి సేవలపై శేషాద్రికి ఉన్న అవగాహన అనన్యసామాన్యం అన్నారు.. ఆలయ ఆచారాలపై శేషాద్రికి ఎంతో అవగాహన, పరిజ్ఞానం ఉందన్న ఆయన.. శేషాద్రి మృతి దేవస్థానానికి, భక్తకోటికి తీరనిలోటుగా పేర్కొన్నారు.. ఆలయ వ్యవహారాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్న ఆయన.. డాలర్‌ శేషాద్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.. ఇక, రేపు డాలర్‌ శేషాద్రి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు సీజేఐ ఎన్వీ రమణ.