Site icon NTV Telugu

Andhra Pradesh: రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ

Ap Cid

Ap Cid

Andhra Pradesh: ఏపీ రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసుపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 1100 ఎకరాల అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణ చేపట్టగా ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో ప్రధాన ముద్దాయిగా మాజీ మంత్రి నారాయణను సీఐడీ పేర్కొంది. తన సొంత బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్లు సీఐడీ ఆరోపిస్తోంది.

Read Also:Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హెచ్చరిక.. అలా చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం..!!

అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయుని పాలెం, వెంకటపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు రావడంతో సీఐడీ విచారణ చేపట్టింది. రామకృష్ణా హౌసింగ్‌ డైరెక్టర్‌ ఖాతాలద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగాయని సీఐడీ అధికారులు నిర్ధారించామని తెలిపారు.

Exit mobile version