NTV Telugu Site icon

Venkatagiri Poleramma Jathara: వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర.. ప్రధాన ఘట్టం పూర్తి..

Poleramma

Poleramma

Venkatagiri Poleramma Jathara: తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టంగా పూర్తి చేశారు.. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి అమ్మవారి సేవకులు ప్రాణప్రతిష్ట గావించారు. ఈ ప్రధాన ఘట్టంతో శ్రీ పోలేరమ్మ అమ్మవారు సమగ్రరూపం దాల్చడంతో భక్తజనులకు దర్శనభాగ్యం కలిగింది. అనంతరం ప్రత్యేక పూల రథంలో నడివీధి ఆలయానికి ముగ్గురమ్మల మూలపుటమ్మ బయలుదేరగా, ఈ అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా సాగింది. తెల్లవారుజాము సరికి అమ్మవారు నడివీధి ఆలయంలో కొలువుదీరగా, అమ్మవారి సేవకుల ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం నుండి భక్తజనులకు దర్శన భాగ్యం కలగనుంది.

Read Also: IND vs BAN: అభిమానులు ఎగిరి గంతేస్తే.. కాన్పూర్‌ స్టేడియం పరిస్థితి ఏంటి?

మొత్తంగా.. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జనజాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తల్లి దీవెనల కోసం పట్టణం భక్తజనసంద్రంగా మారిపోయింది.. జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వెంకటగిరి వాస్తులు స్వస్థలానికి చేరుకున్నారు.. పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరిలోని ప్రతి వీధి కళకళలాడుతోంది. ఇక, ఈ జాతరలో భాగంగా.. ఈ రోజు వేకువజామున అమ్మవారి నిలుపు కార్యక్రమం మొదలైంది.. అమ్మవారి మెట్టినిల్లు నుంచి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీరుతారు. సాయంత్రం వరకు భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.. ఇక, సాయంత్రం అమ్మవారికి అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహిస్తారు. మరోవైపు.. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.. కాగా, రాష్ట్ర పండుగ హోదాలో పోలేరమ్మ జాతర నిర్వహణకు దేవదాయశాఖ ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన విషయం విదితమే.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరిలో జరిగే శ్రీ పోలేరమ్మ జాతరలో పాల్గొననున్నారు.. ఇక, నేడు ఉదయం 11:00 గంటలకు తిరుపతి జిల్లా, వెంకటగిరిలో పోలేరమ్మ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రి కందుల దుర్గేష్..