Chintamaneni Prabhakar: అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర తాడేపల్లి గూడెం చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. అమరావతి టు అరసవెల్లి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫేక్ రైతులు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే ఈ ఫ్లెక్సీలను స్థానిక మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏర్పాటు చేయించారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవగాహన లేమితో రాజధానిపై మూడు ముక్కలాట ఆడుతూ.. అదే మూడు ముక్కలాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దుర్భుద్దితో మంత్రి కొట్టు సత్యనారాయణ ఫేక్ పాదయాత్ర అని.. ఇదంతా చంద్రబాబే చేయిస్తున్నారని రకరకాలుగా ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. కొట్టు సత్యనారాయణకు దమ్ముంటే తాడేపల్లిగూడెంలోని బ్రిడ్జిపై జనాన్ని పోగు చేసి రైతుల పాదయాత్ర నిజమో.. ఫేకో తేల్చాలన్నారు. అంత జనాన్ని పోగు చేసే దమ్ము కొట్టు సత్యనారాయణకు ఉందా అని ప్రశ్నించారు.
Read Also: KVP: ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర సక్సెస్ అవుతుంది
ఉన్మాద ముఖ్యమంత్రి మెహర్భానీ కోసం, ఎక్కడ మంత్రి పదవి ఊడుతుందో అన్న భయంతో మంత్రి కొట్టు సత్యనారాయణ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పాదయాత్ర ఫేకో.. మంత్రి కొట్టు సత్యనారాయణ ఫేకో ప్రజలే తేలుస్తారన్నారు. ఏం మాట్లాడకపోతే మంత్రి పదవి ఊడుతుందని.. సీఎం మెప్పు కోసం ఇలాంటి ఫ్లెక్సీలు కట్టించావా అని మంత్రి కొట్టు సత్యనారాయణను నిలదీశారు. అసలు రైతుల పాదయాత్ర ఫేక్ అని ఎలా అంటారని చింతమనేని ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు.