చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, ఫీడ్ ధరలు అధికమవడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గతంతో పోలిస్తే కిలో చికెన్ ధర గణనీయంగా పెరగగా, కోడి గుడ్ల ధరలు కూడా డజన్‌కు మరింత భారంగా మారాయి. ధరల పెరుగుదల కారణంగా మధ్యతరగతి కుటుంబాలు చికెన్ కొనేందుకు ఆలోచిస్తున్నారు.రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా పండుగలు రావడంతో.. చికెన్, గుడ్లకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో పాటు, డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడం వల్ల గత నెల రోజులుగా ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో సంక్రాంతి పండుగ ఉండటంతో మరో నెల రోజుల పాటు ఈ ధరల పెరుగుదల కొనసాగవచ్చని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.
గుడ్ల ధరలు అధికంగా పెరగడంతో మధ్యాహ్న భోజన పథకంపై కూడా ప్రభావం పడుతోంది. గుడ్ల ధరలు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్డుకు బదులుగా అరటిపండు అందిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఒక్క గుడ్డు ధర రూ.10 వరకు చేరుకుంది. ఇక చికెన్ ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.260 నుంచి రూ.280 వరకు పెరిగింది.