సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులు సరికాదని డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ సందర్భంగా గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకుని సీఐడీ పోలీసులు వేధించారని లేఖలో ఆరోపించారు. అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో అక్రమంగా ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అక్రమంగా కస్టడీలోకి తీసుకుని సీఐడీ పోలీసులు తీవ్రంగా వేధించారని, గంటల తరబడి స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి దాడికి పాల్పడం దారుణమని చంద్రబాబు లేఖలో డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు.
Read Also: Andhra Pradesh: రేపు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న సీఎం జగన్
అయితే సీఐడీ అధికారుల విచారణ గదిలో ఎటువంటి సీసీ కెమెరాలు లేవని.. అరెస్టు చేసే సమయంలో, విచారణ సమయంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు. కొందరు కళంతకితమైన అధికారుల సహకారంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురి చేస్తోందన్నారు. టీడీపీ శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని.. అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం సీఐడీ అధికారులకు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. నేరపూరితమైన కుట్రలకు పాల్పడిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలబడాలని డీజీపీని చంద్రబాబు కోరారు.