NTV Telugu Site icon

Chandrababu: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి.. సీఎస్‌కు లేఖ రాసిన చంద్రబాబు

Chandrababu

Chandrababu

Chandrababu wrotes letter to cs sameer sharma: గోదావరి వరదలతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలను, పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని కోరుతూ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గోదావరి వరదల కారణంగా నాలుగు జిల్లాల్లో వరద బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ సాయం మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చంద్రబాబు కోరారు. గోదావరి వరదలు వేల కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయన్నారు. పలువురి ఇళ్లు కూలిపోవడం, మునిగిపోవడంతో భారీ నష్టం జరిగిందని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వం నుంచి బాధిత ప్రజలకు సరైన సాయం అందలేదని.. ఇప్పటికీ ముంపు గ్రామాల ప్రజలకు ఇళ్లలోకి తిరిగి వెళ్లలేని దారుణ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.

2014లో హుడ్ హుడ్ సమయంలో, 2018లో తిత్లీ తుఫాను సమయంలో టీడీపీ ప్రభుత్వం పరిహారం పెంచి ఇచ్చిందని చంద్రబాబు తన లేఖలో గుర్తుచేశారు. 8 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు పెరిగిన ధరలు, వరదల తీవ్రత, జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత పెంచాలన్నారు. గోదావరి వరద బాధితులకు పరిహారం ఇవ్వాలని.. వరదలతో ఇళ్లు కూలిపోయి, ఇంట్లో సామాగ్రి వరద నీటికి కొట్టుకుపోయి ఆర్థికంగా నష్టం జరిగిందని తెలిపారు. గృహోపకరణాలు నీట మునిగి బాధిత ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారన్నారు. గ్రామాలకు గ్రామాలు వారం రోజుల పాటు వరదలో ఉండిపోవడం వల్ల నష్టం, కష్టం రెట్టింపు అయ్యిందని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుటుంబానికి రూ. 2 వేల సాయం న్యాయబద్ధంగా లేదని ఆరోపించారు. హుడ్ హుడ్ సమయంలో ఇచ్చిన జీవో ద్వారా వరికి హెక్టారుకు ఇన్‌పుట్‌ సబ్సిడీని రూ.15 వేలకు పెంచి టీడీపీ హయాంలో ఇచ్చామన్నారు. తరువాత వచ్చిన తిత్లీ తుఫాను సమయంలో మళ్లీ పరిహారం పెంచి రూ. 20 వేలకు ఇచ్చామన్నారు. ఉద్యాన పంటలకు హెక్టారుకు పరిహారం రూ.15 వేల నుంచి రూ.20 వేలు, అరటికి రూ.30 వేలు, ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.1500గా నాడి నిర్ణయించామని చెప్పారు.

Read Also: Vijaya Sai Reddy: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 లోక్‌సభ, 133 అసెంబ్లీ సీట్లు వస్తాయి

రాష్ట్ర విభజన సమస్యలతో నాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్యాకేజీని పెంచి ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. ఈ 8 ఏళ్లలో పెరిగిన ధరలు, కోవిడ్‌ కష్టాలు, ప్రజలకు జరిగిన అపార నష్టంలోని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరిహారం మళ్లీ పెంచాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు ఇవ్వాలని.. రూ.2.50 లక్షలతో కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని.. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 10 వేలు.. పూర్తిగా దెబ్బతిన్న కచ్చా ఇంటికి రూ. 25 వేలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకు కనీసం రూ.25 వేలు ఇవ్వాలన్నారు. ఆక్వా కల్చర్‌కు రూ.50 వేలు ఇవ్వాలని.. చనిపోయిన వ్యక్తికి రూ.10 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని కోరారు. చనిపోయిన ఆవు లేదా గేదెకు రూ.40 వేలు ఇవ్వాలని.. వరద బాధిత ప్రాంతాలకు మూడు నెలలు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వమే కొత్త మీటర్లు అందచేయాలని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు ఎకరానికి రూ.5 లక్షల అదనపు పరిహారం ఇవ్వాలన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్ కింద ప్రభుత్వం ప్రకటన చేసినట్లు రూ. 10 లక్షల ఇవ్వాలని.. పోలవరం నిర్వాసితులకు దశల వారీ పరిహారం అనే విధానాన్ని పక్కన పెట్టి అందరికీ ఒకేసారి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం కోసం తమ భూములు, ఊళ్లు ఇచ్చి త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.