ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. డిసెంబర్ 1,2022 నుంచి నవంబర్ 30,2023 వరకు జీ20 దేశాల కూటమి సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించనుంది. భారత్‌లో నిర్వహించే జీ20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ జరగనుంది.
అయితే ఈ సమావేశానికి రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ ఆహ్వానించారు. సమావేశ ప్రధాన్యతను టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించి హాజరు కావాల్సిందిగా ప్రహ్లాద్ జోషి ఫోన్‌లో కూడా కోరారు. కాగా ఇటీవల ఆగస్టు నెలలో ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో కేంద్రం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం మోదీతో చంద్రబాబు 5 నిమిషాలకు పైగా మాట్లాడారు. మోదీ, చంద్రబాబు మాట్లాడుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
