NTV Telugu Site icon

Chandrababu to Visit Flood Affected Areas: విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..!

Chandrababu

Chandrababu

జులై నెలలోనే గోదావరి పోటెత్తింది.. లంక గ్రామాలు సహా.. ఎన్నో ప్రాంతాలను ముంచెత్తింది.. చేసేది ఏమీ లేక.. ఉన్న ఊళ్లను వదిలి.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇక, వదరలు తగ్గుముఖం పట్టడంతో.. బాధితులంతా మళ్లీ గ్రామాలకు చేరుకుంటున్నారు.. బురదతో నిండిపోయిన తమ ఇళ్లను పరిసరాలను క్లీన్‌ చేసుకుంటున్నారు.. ఇదే సమయంలో.. పరామర్శల పర్వం కొనసాగుతోంది.. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించగా.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటన.. పరామర్శలు కొనసాగుతున్నాయి.. మరోవైపు.. పోలవరం విలీన మండలాల్లో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు చంద్రబాబు నాయుడు.. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు.. ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Read Also: Minister KTR : కాలికి గాయంతోనే ప్రజాసేవలో కేటీఆర్‌

ఇక, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన పర్యటన వివరాల్లోకి వెళ్తే.. రేపు ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి వరద ప్రాంతాల పర్యటనకు బయల్దేరనున్నారు చంద్రబాబు. మొదటి రోజు అనగా ఈ నెల 28వ తేదీన.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.. శివకాశీపురం, కుక్కునూరులో బాధితులను పరామర్శించనున్న ఆయన.. అనంతరం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ లో ముంపు ప్రాంతాలకు వెళ్లనున్నారు.. మరోవైపు.. రెండో రోజు ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగనుంది.. ఇక, గురువారం రాత్రి భద్రాచలంలో బస చేయనున్న చంద్రబాబు… శుక్రవారం భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు.. ఇప్పటికే భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీలు.. తమను తెలంగాణలో కలపాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో విలీన మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు టూర్‌.. ఆసక్తికరంగా మారింది.