సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు.. రాష్ట్రాన్ని కాపాడు కోవాలి అంటే క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో పని చేయాలని పిలుపునిచ్చారు.. 3 ఏళ్ల జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని ఆరోపించిన చంద్రబాబు.. డ్రైవింగ్ రాని వారిని సీట్లో కూర్చుని బెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు రాష్ట్రంలో అదే పద్ధతి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
Read Also: YS Jagan: సొంత జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే..
ఇక, రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుందని మండిపడ్డారు చంద్రబాబు.. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వస్తారు… కానీ, హత్యలు, దోపిడీ కోసం కాదన్న ఆయన.. నిన్న సభలో మనం పోలీసుల సమస్యలపై మాట్లాడితే పెండింగ్ నిధులు విడుదల చేశారని తెలిపారు. ఉద్యోగులు, పోలీసులకు సమస్యలు వస్తే కూడా మాట్లాడేది తెలుగుదేశం పార్టీయేనని.. ఒక్క పోలీసుల నిధులే కాదు… అందరి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరి లెక్కలు రాస్తున్నాం…. వేధింపులకు తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. కాగా, రాష్ట్రంలో వివిధ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మొదట అనకాపల్లి నుంచి తన పర్యటనను ప్రారంభించిన విషయం తెలిసిందే.