ఏపీ ప్రభుత్వం ఇటీవల 13 కొత్త జిల్లాల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ 26 జిల్లాల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు చంద్రబాబుకు 26 కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వివరించారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీలోనే కొత్త జిల్లాలు నిర్ణయంపై వ్యతిరేకత వస్తుందని ఆయన అన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే రాష్ట్రానికి జగన్ రెడ్డి తీవ్ర నష్టం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. కనీసం కేబినెట్లో కూడా సమగ్రంగా చర్చించకుండా రాత్రికిరాత్రి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
21వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై ఎటువంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. 25వ తేదీ రాత్రికి రాత్రే మంత్రులకు నోట్ పంపి ఆమోదం పొందాల్సిన అత్యవసర పరిస్థితి ఏం వచ్చిందని ఆయన అన్నారు. రాజధాని తరలింపు, జిల్లాల ఏర్పాటు వంటి కీలక అంశాల పైన రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో క్యాసినో వ్యవహారాన్ని వదిలేది లేదు పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు.