NTV Telugu Site icon

Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ.. దిశా చట్టం అమల్లో ఉందా?

Chandrababu

Chandrababu

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం రచ్చగా మారింది. ఇక, ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, మహిళలకు రక్షణలో ప్రభుత్వ వైఫల్యాలను లేఖలో పేర్కొన్నారు.. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. మహిళల పట్ల హింస, అత్యాచారాల ఘటనలు పెరగడానికి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణం అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి.. విజయవాడ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు చంద్రబాబు.

Read Also: RK Roja: చంద్రబాబు ఒక ఉన్మాది.. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు..!

కూతురు కనిపించడంలేదని స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కెళ్లి బాధితురాలి తల్లిదండ్రలు ఫిర్యాదు చేసినా పోలసులు పట్టించుకోకపోవడం అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. విజయవాడలో బాధితురాలిని మేం పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్న ఆయన.. అత్యాచారం ఎప్పుడు జరిగిందో..? ఎక్కడ జరిగిందో..? కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని దుయ్యబట్టారు. జాతీయ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు రాష్ట్రంలోనే జరుగుతుండటం అవమానకరం… మహిళలపై జరుగుతున్న భౌతికదాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయం అని లేఖలో పేర్కొన్న ఆయన.. దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని మీరు చేసిన వాగ్దానం ఏమైంది..? రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందా? ఎన్ని కేసులను నమోదు చేశారు? ఎంత మందిని శిక్షించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇక, ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదని లేఖలో వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.. గంజాయి, డ్రగ్స్‌, మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయన్న ఆయన.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ చర్యలు, ప్రభుత్వ విధానాలు మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ఉండాలని సూచించారు.. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్‌ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించండి అని సలహా ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతికి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇల్లు, జీవనోపాధి కల్పించాలని.. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని లేఖలో డిమాండ్‌ చేశారు చంద్రబాబు నాయుడు.

Show comments