NTV Telugu Site icon

Chandrababu: నేను తలుచుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చేసేవాడా?

Chandrababu Kuppam

Chandrababu Kuppam

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దూరు వద్ద చంద్రబాబును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. అయితే డీఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు చట్టబద్ధత లేదన్నారు. చీకటి జీవోలతో ఎమర్జెన్సీ పాలన తేవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం దయాదాక్షిణ్యాలతో సభలు నిర్వహించాలని అనుకుంటున్నారని చురకలు అంటించారు. రోడ్లపై కాకుండా ఆకాశంలో మాట్లాడతారా అని నిలదీశారు. తనను శారీరకంగా, మానసికంగా బాధపెట్టినా తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. లోకల్ ఎమ్మెల్యేగా తనకు ప్రజలతో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. వైసీపీకి ఒక రూల్, టీడీపీకి ఒక రూల్ ఉంటుందా అని పోలీసులను నిలదీశారు.

Read Also: Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్‌కు పితృవియోగం

సైకో సీఎం పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. ఆనాడు తాను తలుచుకుంటే జగన్ 365 రోజులు పాదయాత్ర చేసేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. అందుకే సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 5 కోట్ల మంది ప్రజల తరఫున తాను పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. వైసీపీ సభలకు జనం వెళ్లకపోతే పెన్షన్ కట్ చేస్తున్నారని.. తన సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తున్నా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. అయినా రెండో తేదీన జీవో ఇచ్చి 1వ తేదీ నుంచి ఎలా అమలు చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తన సభలకు వస్తున్న ఆదరణ చూసి జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తనను చూస్తే ప్రభుత్వానికి వణుకు పుడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. డీజీపీకి చిత్తశుద్ధి ఉంటే బాబాయ్‌ను గొడ్డలితో ఎవరు నరికి చంపాలో కనిపెట్టాలని అన్నారు. ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Show comments