NTV Telugu Site icon

Chandrababu : ఆ నిబంధన రాష్ట్ర దుస్థితికి.. అసమర్థ పాలనకు నిదర్శనం

Chandrababu

Chandrababu

జగన్ సర్కార్ 3 ఏళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదు అని టెండర్‌లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉంది.. దీనికి సీఎం జగన్ సిగ్గుపడాలి అంటూ ఆయన ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్ లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్ లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దు అని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్ర పరువు తీశాయని, తాము చేసిన పనిలో బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లవద్దు అనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోనూ ఉండి ఉండదన ఆయన ఎద్దేవా చేశారు.

న్యాయం కోసం కోర్టుకెళ్లే హక్కు లేదనే నిబంధన పెట్టే హక్కు అసలు మీకు ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణం అయ్యారని, రూ. 13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులు, స్టీల్ ప్లాంట్లు నిర్మిస్తుందా..? మూడు రాజధానుల కడుతుందా..?అని ఆయన చురకలు అంటించారు.