Site icon NTV Telugu

చంద్రబాబు చేసిన తప్పే..మళ్ళీ చేస్తున్నాడా ?

టీడీపీ చేసిన తప్పే తిరిగి చేస్తోందా? సామాజిక సమీకరణాలపై మళ్లీ పప్పులో కాలేస్తోందా? తాజా పరిణామాలపై తమ్ముళ్లలో జరుగుతున్న చర్చ ఏంటి? గతంలో చేసిన పొరపాట్ల నుంచి పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదా?

సామాజిక సమీకరణాల్లో పాత పద్ధతే అనుసరిస్తున్నారా?

గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ సామాజిక సమీకరణాల పరంగా కొన్ని తప్పిదాలకు పాల్పడిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను కాదని.. కాపు సామాజికవర్గం వైపు మొగ్గు చూపింది. ఫలితంగా బీసీ ఓటు బ్యాంకు దూరమైంది. ఆ తర్వాత ప్రతిపక్షంలో వచ్చాక.. తిరిగి బీసీ ఓట్లు పార్టీ వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని భావించారు. కానీ పార్టీ ఆ ట్రాక్ నుంచి పక్కకు వెళ్తోందనే చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాల విషయంలో తిరిగి పాత బాటలోనే పయనిస్తున్నారనే అనుమానం తమ్ముళ్లలో ఉందట.

కాపులకు మళ్లీ ప్రాధాన్యం ఇస్తారా?

గడచిన ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన బీసీ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే దిశగా వైసీపీ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల్లోని పదవులు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు అగ్రపీఠం వేస్తూ ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ రాజకీయ వ్యూహాన్ని గట్టిగా ఎదుర్కొనేలా బీసీలను ఆకట్టుకునేలా టీడీపీ కార్యాచరణ చేపట్టిందా అంటే లేదనే సమాధానమే కన్పిస్తోంది. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కాపులకు మళ్లీ ఎక్కువ ప్రాధాన్యమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా ఉంది.

టీడీపీ పెద్దల నిర్ణయంపై కేడర్‌లో టెన్షన్‌..?

ఇదే సందర్భంలో టీడీపీలో మరో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని చాలామంది ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ వైఖరిపై పార్టీలోని బీసీ సామాజికవర్గ నేతలు ఆందోళన చెందుతున్నారట. గడచిన ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లను ఇవ్వలేమని చెప్పడం ద్వారా బీసీ ఓట్లను వైసీపీ పొలరైజ్‌ చేసుకుంది. అప్పట్లో టీడీపీకి నష్టం చేకూర్చిన అంశాల్లో ఇది కూడా ఒకటని చెబుతారు. ఇప్పుడు కాపు సామాజికవర్గం ముద్ర వేయించుకున్న జనసేనతో పొత్తు ఉంటే.. వైసీపీ మళ్లీ కాపు.. బీసీ ఫార్మూలాను తెరపైకి తెస్తుందని అనుమానిస్తున్నారట. అదే జరిగితే టీడీపీ సంగతి ఏంటనే టెన్షన్‌ టీడీపీ శ్రేణుల్లో ఉందట.

బలమైన రాజకీయ వ్యూహాలు లేవా?

గతంలో చేసిన పొరపాట్లు రిపీట్‌ కాకుండా పార్టీలు జాగ్రత్తపడతాయి. గుణపాఠాలు నేర్చుకుని.. అలాంటి అంశాలపై టచ్‌మీ నాట్‌గా ఉంటాయి. కానీ.. టీడీపీ పెద్దల వ్యూహమే కేడర్‌కు అర్థంకాని పరిస్థితి. 2019 తర్వాత ఏపీలో టీడీపీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉంది. ఈ కష్టం నుంచి గట్టెక్కాలంటే బలమైన రాజకీయ వ్యూహాలు కావాలి. కానీ.. పాత చింతకాయ పచ్చడినే పట్టుకుని వేళ్లాడితే ఉపయోగం ఏంటన్నది కొందరి ప్రశ్న. మరి.. అధినాయకత్వం ఈ అంశాన్ని గమనించిందో లేదో.. కేడర్‌ మాత్రం భవిష్యత్‌ను తలచుకుని హడలిపోతోందట.


Exit mobile version