ఒకే ఒక్క మాటతో టీడీపీ నాయకుడు పట్టాభి రేపిన వ్యాఖ్యల దుమారంతో రేగిన చిచ్చు ఇప్పుడు ఢిల్లీని తాకింది. వైసీపీ, టీడీపీలు ఎత్తుకు, పైఎత్తు వేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. అయితే అధికార వైసీపీ త్రిముఖ వ్యూహంతో టీడీపీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు. ఏపీలో వ్యవస్థలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది బాబు నాయకత్వంలోని బృందం.
అయితే ఈ ఎపిసోడ్ పై… ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహ దీక్షలతో ముందుకెళ్లిన వైసీపీ… రాష్ట్ర వ్యవహారాలు తెలిసేలా రాష్ట్రపతికి ఓ లేఖ పంపించాలనే వ్యూహంతో ఉంది . గౌరవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిపై టిడిపి నాయకుల అనుచిత వ్యాఖ్యలు, దానికి సంబంధించిన వీడియోస్ తో పాటు… రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారడానికి చంద్రబాబే కారణమంటూ ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు… ఈ వ్యవహారం మొత్తం రాష్ట్రపతి చెవిలో వేయాలని తద్వారా చంద్రబాబు కు ఢిల్లీలో షాక్ ఇవ్వాలని ప్లాన్ వేసింది వైసీపీ అధిష్టానం. మరోవైపు ఎన్నికల కమిషన్ కు కూడా ఈ విషయంపై లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు వైసీపీ ఎంపీలు. అసభ్య పదజాలంతో ఎమ్మెల్యేలను ఎంపీలను చివరికి ముఖ్యమంత్రిని కూడా టార్గెట్ చేస్తున్నారని., ఇలాంటి రాజకీయ పార్టీల గుర్తింపు ను రద్దు చేయాలని కోరనున్నారు.
