టీడీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు (104) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాదులోని తన కుమార్తె నివాసంలో తెల్లవారుజామున యడ్లపాటి మృతి చెందారు. ఆయన మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు రాజకీయ కురువృద్ధులు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా సాగిందన్నారు.
రాష్ట్ర మంత్రిగా, జడ్పీ చైర్మన్‌గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన ఆయన తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని పేర్కొన్నారు. యడ్లపాటి జీవితం ప్రతీతరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. యడ్లపాటితో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని, యడ్లపాటి కుంటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేశారు.