టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆకస్మిక మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. బొజ్జల వార్త తెలియగానే తాను ఆవేదనకు గురయ్యానని తెలిపారు. బొజ్జల మరణం అత్యంత బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. లాయర్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన బొజ్జల ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారన్నారని గుర్తుచేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు బొజ్జల ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బొజ్జల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న నేపథ్యంలో బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికి ఫోన్ చేసి ఆయనకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా బొజ్జల మృతి పట్ల ట్విట్టర్‌లో స్పందించారు. తన తండ్రి ఆప్త మిత్రుడు, రాజనీతిజ్ఞుడు బొజ్జల మృతి చాలా బాధాకరమని లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ తీసుకున్న ఎన్నో కీలక నిర్ణయాల్లో విలువైన సలహాలు ఇచ్చిన వ్యూహకర్త బొజ్జల అని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించడంతో పాటు మంత్రిగా ఆయన నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే వారని లోకేష్ గుర్తుచేసుకున్నారు. బొజ్జల ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని లోకేష్ పేర్కొన్నారు.
మరోవైపు బొజ్జల మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా తీవ్ర సంతాపం తెలియజేశారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. బొజ్జల ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నారు. ఏపీకి బొజ్జల చేసిన సేవలు మరువలేమని గవర్నర్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. అటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల, సోమిరెడ్డి, పయ్యావుల, ధూళిపాళ్ల నరేంద్ర కూడా బొజ్జల మృతి పట్ల సంతాపం తెలిపారు. బొజ్జల మృతి పట్ల బీజేపీ ఎంపీ సీఎం రమేష్, సీపీఐ రామకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఐదుసార్లు, మంత్రిగా ఆయన నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే వారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.(2/2)
— Lokesh Nara (@naralokesh) May 6, 2022