CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే

  • నెక్టివిటీపై చంద్రబాబు ఫైర్.. కలెక్టర్లకు డెడ్‌లైన్
  • 7 రోజుల్లో ల్యాండ్.. తర్వాత టవర్లు
  • చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. నెట్‌వర్క్‌పై నో కంప్రమైజ్
  • తర్వాతి కాన్ఫరెన్స్‌కు 100% కనెక్టివిటీ
Chandrababu

Chandrababu

CM Chandrababu : అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో డిజిటల్ కనెక్టివిటీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి మూలకూ నెట్‌వర్క్ కనెక్టివిటీ చేరాల్సిందేనని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్‌వర్క్ పరిస్థితులను వివరించిన అనంతరం, సీఎం చంద్రబాబు అధికారులు, కలెక్టర్లకు స్పష్టమైన గడువు విధిస్తూ సున్నితంగా హెచ్చరించారు.

ల్యాండ్ ఇవ్వడానికి 7 రోజులే గడువు

రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతానికి కనెక్టివిటీ కల్పించడానికి ఎంత సమయం తీసుకుంటారో వెంటనే చెప్పాలని ఐటీ కార్యదర్శిని సీఎం నిలదీశారు. టవర్ల ఏర్పాటుకు భూకేటాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, కేవలం 7 రోజుల్లో కనెక్టివిటీకి అవసరమైన భూమిని అప్పగించాలని స్పష్టం చేశారు. నెట్‌వర్క్ టవర్ నిర్మాణం కోసం ఉచితంగా ల్యాండ్ ఇవ్వడంతో పాటు, నెట్‌వర్క్ ఆపరేటర్లకు విద్యుత్‌ను కూడా ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని అధికారులు సీఎంకు వివరించారు.

ఒక్క టవర్‌కు ఐదు సెంట్లే… బాధ్యత అందరిదీ

ఒక టవర్ నిర్మించడానికి కేవలం 5 నుంచి 5.5 సెంట్ల భూమి మాత్రమే అవసరమవుతుందని, అలాంటప్పుడు భూసేకరణలో ఆలస్యం ఎందుకని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఒకసారి సంక్షేమ, అభివృద్ధి ప్రోగ్రామ్‌ను చేతిలోకి తీసుకున్నాక దానికి కేవలం ఐటీ కార్యదర్శి మాత్రమే బాధ్యుడు కాదని, జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు కూడా పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని వివరించినప్పటికీ, సీఎం చంద్రబాబు మాత్రం కచ్చితమైన గడువులోనే పనులు పూర్తికావాలని ఆదేశించారు.

హిస్టరీ రిపీట్ చేస్తామంటే ఊరుకోను

“పాత పద్ధతుల్లోనే పనిచేస్తాం, కథ మళ్లీ మొదటికి వస్తుంది అంటే నేను ఊరుకోను… నాకు కావాల్సింది కేవలం ఫలితాలు మాత్రమే” అని సీఎం అధికారులకు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో డిజిటల్ నెట్‌వర్క్ కల్పించాలనే ఆలోచన తనకంటే ముందుగా కలెక్టర్లకే ఉండాలని వ్యాఖ్యానించారు. రాబోయే తదుపరి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం నెట్‌వర్క్ కనెక్టివిటీ అందుబాటులోకి రావాల్సిందేనని, ఈ లక్ష్యాన్ని సాధించడంలో అధికారులు యంత్రాంగాన్ని పరుగులు తీర్పించాలని ఆదేశించారు.