Site icon NTV Telugu

Chandra Babu: మొన్న వెంకాయమ్మపై.. ఇప్పుడు ఆమె కుమారుడిపై.. చర్యలు తీసుకోరా?

Chandrababu

Chandrababu

గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు వాసి వెంకాయమ్మ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై వైసీపీ వర్గీయుల దాడులు రాష్ట్రంలో పరిపాటిగా మారాయని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. దాడులు, దూషణలు, బెదిరింపులు, హత్యల ద్వారా తమను విమర్శించేవాళ్లను వైసీపీ భయాందోళనలకు గురిచేస్తోందని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారుల సహకారంతో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు వివరించారు.

ప్రభుత్వాన్ని విమర్శించారంటూ గత నెల 16వ తేదీన వెంకాయమ్మపై దాడి చేసిన వైసీపీ వర్గీయులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వెంకాయమ్మ కుమారుడు వంశీపై తాజాగా దాడి చేశారని.. ఈ రోజు వైసీపీ వర్గీయులు చేసిన దాడిలో తృటిలో వంశీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. పోలీసులు తక్షణమే స్పందించి వెంకాయమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Exit mobile version