అమలాపురం అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారన్నారు. మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోయడం జగన్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు.
ప్రభుత్వాన్ని జగన్ నడపలేరని.. అందుకే ఆయన మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడుతున్నారని చంద్రబాబు వ్యా్ఖ్యానించారు. టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని.. వైసీపీ తాటాకు చప్పుళ్లకు టీడీపీ కార్యకర్తలెవరూ భయపడేది లేదన్నారు. జగన్ చేస్తున్న దానికి అంతకు అంత చెల్లిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహానాడుకు బస్సులివ్వకుండా.. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లని భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ రాష్ట్రం వైసీపీ అబ్బ జాగీరా అని నిలదీశారు. జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి అని.. మహానాడుకు నడిచైనా ఎడ్లబళ్లల్లోనైనా రావాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఇదే మహానాడు నినాదం అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైనా బాగుందని చెప్తే తాను తిరిగి అమరావతికి వెళ్లిపోతానన్నారు. వైసీపీలో సామాజిక న్యాయం ఎక్కడుందో చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమపై వైసీపీకి ప్రేమ లేదని.. అందుకే రాజ్యసభ స్థానాలు ఈ ప్రాంతాలకు కేటాయించలేదని ఆరోపించారు. విశాఖ మీద ప్రేమ ఉందని.. రాజధాని తీసుకువెళ్తానని చెప్పిన వారు రాజ్యసభ స్థానాలు ఎందుకు కేటాయించలేదో చెప్పాలన్నారు. వైసీపీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ముద్దాయిలే ఉన్నారని గుర్తుచేశారు.
ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేపడతారని నిలదీశారు. ఎస్సీలకు చెందిన 28 స్కీములను రద్దు చేశారని.. డబ్బులున్న వాడికి ఊడిగం.. పేదవాళ్లను దోచుకోవడమే జగన్ థియరీ అని చంద్రబాబు విమర్శించారు. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. దావోస్‌కు వెళ్లి అదానీ, గ్రీన్ కోతో జగన్ ఒప్పందాలు చేసుకున్నారని… టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న అదానీ, గ్రీన్ కోతో ఒప్పందాలు కొనసాగించారు కానీ.. అన్న క్యాంటీన్లు ఎందుకు కొనసాగించరని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవరును చంపేస్తే.. కప్పి పుచ్చే ప్రయత్నం చేశారని.. టీడీపీ పోరాడితే కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. అనంతబాబు వ్యవహరంలో వైసీపీని ప్రజలు ఛీ కొట్టారని చంద్రబాబు ఆరోపించారు.