NTV Telugu Site icon

ChandraBabu: గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్.. మాచర్ల పోలీసులపై చర్యలకు డిమాండ్

Chandrababu

Chandrababu

ChandraBabu: గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. అయితే ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. మాచర్ల పరిస్థితులపై గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి మాచర్ల ఘటన అద్దం పడుతుందని చంద్రబాబు అన్నారు. ఇలాంటి చర్యలకు వైసీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదన్నారు.

Read Also: Girl Suspicious Death: వీడని సస్పెన్స్‌.. ఉద్రిక్తతల నడుమ చిన్నారి అంత్యక్రియలు

అటు ఏపీలో వైసీపీ అరాచక పాలనకు మాచర్ల ఘటన నిదర్శమని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నేతలు పోలీసుల సహకారంతో టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. దాడి చేసిన గూండాలను వదిలేసిన పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం, మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మాచర్లలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతుందని.. ఫ్యాక్షన్ గొడవలే అల్లర్లకు కారణమని పల్నాడు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఫ్యాక్షన్ గొడవలకు కొంతమంది రాజకీయ రంగు పులుముతున్నారని ఎస్పీ ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మాచర్లలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు.