NTV Telugu Site icon

టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబుపై పోలీసుల దాడి

గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనకు సంబంధించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద్‌బాబు కూడా పాల్గొన్నారు. అయితే ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు సృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది.

Read Also: మద్దతు ధర అడిగితే జైల్లో పెడతారా.. జగన్‌పై చంద్రబాబు ఫైర్‌

ఈ నేపథ్యంలో చదలవాడ అరవింద్‌బాబును నర్సరావుపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అరవింద్‌బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించగా… మరోసారి పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.