Vijayawada: విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణలకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఉంటాయని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ సందర్భంగా భవానీ దీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కరోనా తరువాత ప్రస్తుత పరిస్థితి సాధారణం కావడంతో ఈ ఏడాది 7లక్షల మంది వరకు భవానీలు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈనెల 15వ తేదీ ఉదయం 6గంటల నుంచి దీక్షల విరమణ ప్రారంభం అవుతుందని ఈవో భ్రమరాంబ వెల్లడించారు. 3 అగ్ని గుండాలు కూడా ఈ ఏడాది ఏర్పాటు చేశామని.. భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశఖండన శాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Read Also: Farmers Agitation : ఢిల్లీలో రోడ్డెక్కిన రైతులు.. హామీలను అమలు చేయాలని డిమాండ్
గత ఏడాది భవానీల దీక్షల విరమణ ద్వారా రూ.6 కోట్ల ఆదాయం వచ్చిందని.. 5 కోట్లు ఖర్చు అయ్యాయని ఆలయ ఈవో భ్రమరాంబ వెల్లడించారు. .దీక్షల తర్వాత బట్టల సేకరణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని.. వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగా క్యూలైన్స్ ద్వారా దర్శనం ఉంటుందన్నారు. రెండు క్యూ లైన్స్ ద్వారా దర్శన ఏర్పాట్లు చేశామని తెలిపారు. 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందిస్తున్నామని.. 20 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రతి రోజూ ఉదయం 3 నుంచి రాత్రి 11 వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. 19న పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ ముగింపు ఉంటుందన్నారు.
