NTV Telugu Site icon

Central Team: ఓ వైపు వరద.. మరోవైపు కేంద్ర బృందం..

Central Team

Central Team

జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో చాలా ప్రాంతాల్లో ముంపునకు గురయ్యాయి.. ఉన్న ఇల్లు, ఊరిని విడవాల్సి వచ్చింది.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వచ్చాయని భావిస్తోన్న తరుణంలో మరోసారి గోదావరి పోటెత్తుతోంది.. క్రమంగా వరద ప్రవాహం పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఇదే సమయంలో.. జులై నెలలో జరిగిన వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది కేంద్ర బృందం.. నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన సాగనుంది.. గత నెలలో వరదల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ, గృహ నష్టాలను పరిశీలించనుంది ఇంటర్ మినిస్ట్రీయల్ కేంద్ర బృందం. ఈ రోజు ఉదయం 9 గంటలకు రాజమండ్రి నుండి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా రావులపాలెం మండలం గోపాలపురం చేరుకోనున్న కేంద్ర బృందం .. గోపాలపురంలో ఏర్పాటు చేసిన ఉద్యాన వ్యవసాయ పంట నష్టాలపై చాయా చిత్ర ప్రదర్శనను, దెబ్బతిన్న ఉద్యాన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనుంది..

Read Also: Astrology : ఆగస్టు 11, గురువారం దినఫలాలు

ఇక, పి.గన్నవరం మండలం నాగుల్లంక చేరుకుని స్థానికంగా దెబ్బతిన్న ఉద్యాన వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించనుంది కేంద్ర బృందం… రాజోలు మండలం మేకలపాలెంలో జలవనరుల శాఖ గోదావరి వరదల ఉధృతిని తెలిపే ఛాయా చిత్ర ప్రదర్శన తిలకించి, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనున్నారు.. అనంతరం దిండి రిసార్ట్స్ లో విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాత విజయవాడ బయల్దేరి వెళ్లనుంది కేంద్ర బృందం.. మరోవైపు.. గోదావరిలో క్రమంగా వరద ప్రభావం పెరుగుతోంది.. ధవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర 14 అడుగులకు చేరింది నీటిమట్టం.. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. బ్యారేట్‌ గేట్ల ద్వారా 13 లక్షల 19వేలు క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక, సహాయక చర్యల్లో మొత్తం 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం లో ఎన్డీఆర్ఎఫ్, అమలాపురం లో 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం లో ఎన్డీఆర్ఎఫ్, విఆర్ పురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి.. ఏలూరు జిల్లా, కుకునూర్ కు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తరలించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో పాశర్లపూడి అప్పనపల్లి కాజ్వే నీట మునిగింది.. మూడు గ్రామాలకు, అప్పనపల్లి , దొడ్డవరం, పెదపట్లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. సఖినేటిపల్లి మండలం అప్పన్న రామునీ లంక టేకీ శేట్టిపాలెం వంతెన నీట మునగడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఇక, వరద ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ప్రజల సహాయార్థం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో 24 గంటలపాటు అధికారులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.. వరద సహాయం కోసం 8977935609 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఈనెల 17 వరకు రెండు షిఫ్ట్ ల్లో సిబ్బందిని నియమించారు అధికారులు.