Site icon NTV Telugu

Andhra Pradesh: అమరావతికి కేంద్రం భారీ ఊరట.. రాజధాని నిర్మాణానికి నిధులు విడుదల

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్రం ఊరట కలిగించే వార్తను అందించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర బడ్జెట్‌ 2022-23లో రాజధాని ప్రొవిజన్ ఇచ్చి మరీ నిధులను కేటాయించింది. ఇందులో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం నిధులు కేటాయిస్తున్నారో అన్న విషయం కూడా ప్రస్తావించింది. దీంతో ఈ నిధులను ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు సచివాలయ నిర్మాణం కోసం రూ.1,224 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,123 కోట్లు, జీపీవోఏకు భూసేకరణ కోసం రూ.6.69 కోట్లు కేటాయించింది. దీంతో ఈ మేరకు నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ నిధులను జగన్ సర్కారు ఎలా ఖర్చు చేస్తుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది. తాజా ఉత్తర్వులతో కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉందనే సంకేతాలను పంపిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Exit mobile version