Byreddy Rajasekhar Reddy: రాయలసీమ హక్కుల కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్న రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాయలసీమ సుడిగుండంలో ఇరుక్కు పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాయలసీమ ప్రాంతం వెంటిలేటర్ మీద ఉందంటూ పేర్కొన్నారు.. కర్నూలులో ఇవాళ మీడియాతో మాట్లాడిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తే రాయలసీమకు న్యాయం జరుగుతుందని తెలిపారు.. తీగల వంతెన వద్దు అంటు ఎమ్యెల్యే , ఎంపీలకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.. ఇక, 5,300 కోట్ల రూపాయల వ్యయంతో అప్పరభద్ర ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.. కానీ, అప్పరభద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.. 25న రాజోలి బండ నుండి పాదయాత్ర కొనసాగిస్తాం అని ప్రకటించారు.. అప్పరభద్ర ప్రాజెక్టు విషయంలో పాలకులకు రాబోయే కాలంలో ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
Read Also: Tomato Shortage: యూకేలో తీవ్రంగా టొమాటోల కొరత.. ఖాళీగా సూపర్ మార్కెట్లు..
కాగా, రాయలసీమకు వైఎస్ జగన్ సర్కార్ చేసింది శూన్యమని గతంలోనే ఆరోపించారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. సాగు – తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూనే, రాయలసీమ ప్రాంతాన్ని సిఎం జగన్ ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా..? అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదని, విశాఖలో పరిపాలన రాజధాని అవసరం లేదని ప్రజలే చెబుతున్నారన్న ఆయన.. రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. 28వ తేదీన ఛలో సంగమేశ్వరం, సిద్ధేశ్వరం కార్యక్రమాన్ని సక్సెస్ చేశారని గుర్తుచేశారు. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి- బ్యారేజ్ నిర్మించాలని, దాంతోపాటు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే రాయలసీమకు నీటి చుక్క కూడా మిగలదని వ్యాఖ్యానించారు. కరువుకు సమాధానం చిత్తూరు జిల్లాతో పాటుగా గతంలో నిర్మాణం చేయాలనుకున్న కృష్ణా పెన్నారు ప్రాజెక్టు కట్టలేదో, ఇప్పుడు నిర్మాణానికి అవకాశానికి ఛాన్స్ వచ్చిందన్నారు. అయితే తీగల వంతెనకు బదులుగా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించాలని డిమాండ్ తో ఛలో సిద్ధేశ్వరం అని పిలుపునిస్తే మారుమూల ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారని గతంలోనే ఆయన గుర్తుచేసిన విషయం విదితమే.