ఏపీలో సంచలనం కలిగించిన తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ స్కాం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్నారు. తణుకు టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారన్నారు.
ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పది రోజుల క్రితమే నాకు ఫిర్యాదు చేశారు. కారుమూరిపై టీడీపీ ఆరోపణలు అర్దరహితం అన్నారు మంత్రి బొత్స. అక్రమాలకి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నాం…పూర్తి స్ధాయి విచారణకి ఆదేశించాం అన్నారు. మాట్లాడటానికి విషయం లేక అసెంబ్లీలో టీడీపీ నేతలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
తణుకు మునిసిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా టీడీఆర్ బాండ్ల జారీ పైన ప్రభుత్వం సీరియస్ అయింది. తణుకు మునిసిపల్ కమిషనర్ యన్. వాసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి ఏ. రామకృష్ణ,టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఏ యస్ ప్రసాద్ లు సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఆదేశాలు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా 1:2 పద్దతిలో బాండ్లు జారీ చేయాల్సి ఉండగా 1:4 పద్దతిలో బాండ్లు జారీచేసారని ఆదేశాల్లో తెలిపారు.
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్ల జారీలొ భారీ అవినీతికి పాల్పడ్డారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రెండు రోజుల క్రితం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తణుకు మునిసిపల్ అధికారులపై చర్యలు తీసుకుంది సర్కార్. మద్యపాన నిషేదం అమలు చేసింది ఎన్టీఆర్ అయితే దానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా అని బొత్స ప్రశ్నించారు. మద్య నిషేదం అమలు చేస్తామని మేము చెబుతున్న విధంగానే చర్యలు తీసుకుంటున్నాం. నాలుగు రోజులగా సభని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టీడీపీ సభ్యులని సస్పెండ్ చేసి సభ నిర్వహిస్తున్నాం అన్నారు. సోమవారం సాయంత్రం ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై మరోసారి చర్చించనున్నాం అని తెలిపారు మంత్రి బొత్స.