కడపలో ఈ రోజు రాయలసీమ రణభేరి సభ నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. సీమలో పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు రణభేరి సభకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ వేదికపై రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టు సాధన కోసం వరుస ఆందోళనలు చేపట్టే దిశగా కార్యాచరణ ప్రకటించనున్నారు. రాయలసీమ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేయనున్నారు. రాయలసీమ రణభేరి సభలో పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు బీజేపీ నేతలు.
Read Also: COVID 19: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్నింగ్..
ఇప్పటికే కడపలోని ఓ హోటల్‌లో రాయలసీమ జిల్లాల ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీఎం రమేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీమలో ఏ ప్రాజెక్టులూ పూర్తికాలేదని.. కొద్దిపాటి నిధులిస్తే పూర్తయ్యేవన్నారు సోము వీర్రాజు. సాగునీటిపారుదలశాఖకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు జరగలేదన్నారు. బిందు సేద్యం పరికరాల్లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రతి విభాగంలో అరాచాకాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రణభేరి సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమ రణభేరి సభకు పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షులు సోమూ వీర్రాజు, ఇతర ఎంపీలు, రాయలసీమ బిజెపి నాయకులు ఈ సభలో పాల్గొనున్నారు.