ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం అసలు ప్రస్తుతం ప్రస్తావనలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. రెవిన్యూ డెఫిషిట్ గ్రాంట్ ఏపీకి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని జీవీఎల్ తెలిపారు. ఏపీ అభివృద్ధిపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని.. వెలిగొండ విషయంలో ప్రస్తుత, గత ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. ఒంగోలు, నరసరావుపేట ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన నేతలనే ఎంపీలుగా చేస్తున్నారన్నారు. కేంద్రం ఏదైనా చేస్తే మేమే ఉత్తరం రాశాం అని డబ్బాలు కొట్టుకుంటున్నారు..
ఏపీలో ఉన్న ఎంపీలు మీ ప్రాంత సమస్యలు చెప్పుకోవటానికి సీఎం దగ్గర మీకు అపాయింట్ మెంట్ అయినా దొరుకుతుందా అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ ప్రజల కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్పించేందుకు వెనుకబడిన జిల్లాల జాబితాను ప్రభుత్వం త్వరగా పంపాలని సూచించారు. ఏపీలో జిల్లాకో ఎయిర్ పోర్టు పెడతామన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని .. పరిపాలన సౌలభ్యం కోసం ఎక్కువ జిల్లాలు ఉండటం మంచిదే అని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
